Wednesday 19 May 2021

కార్యదర్శి

 \Perspective Rama Krishna says@

శారద ' కార్యదర్శి ' అనే ఒక డిటెక్టివ్ నవలిక కూడా రాసాడు. హంస ప్రచురణలు - బెజవాడ వారు 1956 లో ప్రచురించారు. వెల పన్నెండు అణాలు. పేజీలు 108.




Sarda by Rompicharla Bhargavi

 తెలుగు సాహిత్య రంగంలో వినపడిన శక్తివంతమైన అన్య స్వరం "శారద" by Rompicharla Bhargavi

---------------------------------------------------------------------------------------------------------------------------

శక్తివంతమైన అని ఎందుకన్నానంటే 1948-55 ప్రాంతాలలో "శారద" రచనలు ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపాయి,అతను రచనలు చేసింది కొద్దికాలమైనా( సుమారు ఆరేడేళ్లు)అయినా ఒక సంచలనం సృష్టించిన వాడు "శారద"
అతని రచనలని, ఎన్నదగిన రచయితలయిన నండూరి రామ్మోహన్రావు,ముళ్లపూడి వెంకట రమణ,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి దగ్గర నుండీ సామాన్య తెలుగుపాఠకుడి వరకూ ఆసక్తిగా చదివేవారు ఆరోజుల్లో అంటే అతడెంత శక్తివంతమయిన రచయితో అర్థమవుతుంది.
అన్య స్వరం అనడానికి కారణం అతను తెలుగువాడు కాదు తమిళుడు,సుమారు పన్నెండేళ్ల వయసులో పొట్టచేత్తో పట్టుకుని,తండ్రితో పాటు ఉపాథి వెదుక్కుంటూ తమిళనాడు నుండీ తెనాలి వలస వచ్చిన వాడు .
అలాంటి వాడు ఒక చెంప దుర్భర దరిద్రం అనుభవిస్తూ ,పస్తులుంటూ,హోటల్లో సర్వరు గానూ,కూలీ గానూ,ఇంకా అనేక చిన్నా చితకా పనులు చేస్తూ,తెలుగు భాష నేర్చుకుని,ఆ భాషని ప్రేమించి,అందులో రచనలు చేయడం ఎంత గొప్ప విషయం!అవసరం కోసం భాష నేర్చుకునే వారు అనేక మంది వుంటారు కానీ ఆ భాషమీద ప్రేమను పెంచుకునే వారు తక్కువ,ఒక వేళ ఆ భాషంటే ఇష్టం వున్నా, ప్రతిభా వంతమైన రచనలు చేసే వారు దాదాపు అరుదనే చెప్పాలి.
అతని రచనల గురించి ప్రముఖ సంపాదకులూ, రచయితా ,నండూరి రామ్మోహన్రావు గారు తన జ్ఞాపకాలు రాస్తూ యేమంటారంటే "మాతృభాష తెలుగు కాక పోయినా,అతను తెలుగువాడు కాక పోయినా తన రచనల్లో అంత గొప్పగా తెలుగుతనాన్ని పండించడం నాకిప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది" అని
అటువంటి రచనలు చేసిన "శారద" గురించి తెలుసుకోవాలని ,చిన్నప్పటి నుండీ నాకు చాలా కుతూహలం
అసలు "శారద" ఎవరు? అతని జీవితం ఎలా గడిచింది తెలుసుకునేందుకు రెండు పుస్తకాలు బాగా ఉపయోగ పడతాయి.ఒకటి ఆయనతో సన్నిహితంగా మసిలిన ఆలూరి భుజంగరావు గారి "సాహిత్య బాటసారి శారద",రెండు ప్రముఖ రచయితా,ఆయనతో కొద్ది పరిచయమూ కలిగి వున్న "విహారి" గారి "కష్టజీవి,సాహిత్య చిరంజీవి శారద"
"శారద" అసలు పేరు సుబ్రమణ్యయ్యర్ నటరాజన్ అతను 1924 లో జన్మించాడు.సుబ్రమణ్యయ్యర్ అనేది అతని తండ్రిపేరు,తమిళ సంప్రదాయం ప్రకారం తండ్రిపేరు ముందు వచ్చింది.అతని తల్లి భాగీరథి ,అతనికి రెండేళ్ల వయసులోనే చనిపోయింది.
నటరాజన్ తిరుచినాపల్లికి చెందిన వాడయినా,పుట్టి పదేళ్ల వయసు వరకూ పెరిగిందిపుదుక్కోటలో.
తండ్రి సుబ్రమణ్య అయ్యర్ కి రెండు పెళ్లిళ్లు ,మొదటి పెళ్లిలో ఇద్దరు ఆడపిల్లలు మీనాక్షి,మంగళ ఇద్దరి కీ పెళ్లిళ్లయ్యాయి.వారు మద్రాసులో స్థిరపడ్డారు,మీనాక్షి అత్తింటి వారు మంచి స్థితిపరులు.
రెండవ భార్య భాగీరథికి ఇద్దరు ఆడపిల్లలూ,ఇద్దరు మగపిల్లలూ
ఆడపిల్లలు సుబ్బలక్ష్మమ్మ,సుందరమ్మ.మగపిల్లలు చంద్రశేఖరన్ ,ఆఖరి వాడు నటరాజన్ .
రెండవ భార్యకి పుట్టిన ఆడపిల్లలిద్దరినీ తెనాలికి చెందిన తెలుగు వాళ్లకి ఇచ్చి చేశాడు సుబ్రమణ్యయ్యర్ .
ఇక పెద్దకొడుకు చంద్రశేఖరన్ బాగా చదువుకున్నాడంటారు,ఇంగ్లీషు బాగా మాట్లాడే వాడట,అతను మిలటరీలో చేరిపోయాడు,అతనికి కూడా తెలుగుదేశంతో సంబంధాలుండేవి.ఒక తమిళ భార్య వుండగానే ,బెజవాడలో వుండే ఒక తెలుగావిడతో అనుబంధం వుండేది,అతను తరచూ బెజవాడ వచ్చి పోతుండే వాడు.
భాగీరథి చనిపోయాక పుదుక్కోటలో వుండలేక,చిన్న కొడుకు నటరాజన్ ని తీసుకుని జీవిక వెదుక్కుంటూ చెన్నపట్నం వచ్చాడు సుబ్రమణ్యయ్యర్ .చిన్నా చితకా పనులు చేస్తూ పొట్ట పోసుకునే వారు తండ్రీ కొడుకూ.
ప్రెస్ లోనూ,పత్రిక లోనూ (దినమణి కదిర్ )పనిచేయడంతో పాటు,ఇంటింటికీ పేపర్ వేసే తండ్రికి సహాయంగా గంధపు వుండలమ్మే షాపులో రోజువారీ గంధం అరగదీసే పని చేసి పావలా,అర్థా సంపాదించి తండ్రికిచ్చే వాడు చిన్న నటరాజన్
ఇలా కొంతకాలం గడిచేసరికి మద్రాసులో జీవితం దుర్భరంగా అనిపించి,కూతుళ్ల నిచ్చిన ఆంధ్ర దేశమయిన తెనాలి లో కొంత మెరుగయిన జీవితం గడప వచ్చనిపించి,తెలుగుదేశం వలస వచ్చాడు సుబ్రమణ్యయ్యర్ నటరాజన్ తో పాటు.
అలా 1937లో ఓ చలికాలపు ఉదయం తెనాలి రైల్వే ప్లాట్ ఫామ్ మీద కాలు మోపాడు నటరాజన్.



సుబ్రమణ్యయ్యర్ అల్లుళ్లిద్దరూ ఆంధ్ర దేశంలో వున్నారని చెప్పుకున్నాం కదా పెద్ద కూతురు సుబ్బలక్ష్మమ్మ భర్త యల్లాప్రగడ నరసింహారావు గుంటూరులో వుండేవాడు,రెండో కూతురు సుందరమ్మ భర్త యల్లాప్రగడ భీమారావు తెనాల్లోనే హోటల్ నడుపుతూ వుండేవాడు . ఆహోటల్ పేరు రాధాకృష్ణ విలాస్ మారీస్ పేటలో బస్టాండ్ దగ్గర వుండేది.అందరూ భీమయ్య హోటల్ అని పిలిచే వారు తెనాలి చేరిన సుబ్రమణ్యయ్యర్ ,నటరాజన్ భీమయ్య ఇంటికి చేరారు.నటరాజన్ కి ఊరికే తిండి పెట్టడం ఇష్టం లేక తన హోటల్ లో సర్వర్ పనిచ్చాడు భీమయ్య నటరాజన్ ని 'నటరాజ్ ' అనీ 'నటాయ్ ' అనీ పిలిచే వాళ్లు.కొన్నాళ్లు సర్వర్ గా పని చేసిన తర్వాత ,వంట చేయడం నేర్చుకుని ,వంట గదిలో "సరుకు మాస్టర్ "గా పనిచేస్తుండే వాడు నటరాజన్ .సర్వర్ గా పనిచేసే కంటే వంటగదిలో పని చేస్తే తనకు పుస్తకాలు చదువు కోవడానికీ,రచవలు చేయడానికీ తగినంత తీరిక దొరుకుతుందనే కారణం తోనే అతను వంట నేర్చుకున్నట్టు కనపడుతుంది. ఇలా హోటల్లో పనిచేయడానికీ,లోకవ్యవహారానికీ అతనికి తెలుగు నేర్చుకోవాలసిన అవసరం కలిగిందిపై,పైగా అతను విపరీతమైన చదువరి ,తెలుగులో పుస్తకాలు చదువు కోవడానికి కూడా అతను తెలుగు నేర్చుకోదలుచుకున్నాడు. ఇక్కడ భాష గురించి రెండు ముక్కలు ,ఈ భాష గొప్పదనీ,ఈ భాషతక్కువదనీ వుండదు." ఒకభాష వచ్చినందుకు గర్వ పడవలసిన అవసరంకానీ,ఒక భాష రానందుకు సిగ్గు పడవలసిన అవసరం కానీ లేదు,మన అవసరాన్ని బట్టి ఆ భాషను నేర్చుకోగలుగుతాము" అనే రంగనాయకమ్మ గారి మాటలు నూటికి నూరు పాళ్లూ నిజమనిపిస్తాయి నాకు. అయితే మన మాతృభాష వ్యాకరణంతో సహా మనకి తెలియకుండా నే వస్తుంది,ఉదాహరణకి "వచ్చింది,వెళుతుంది" అనే మాటలు మనం సహజంగా పలుకుతాము ,అవే మాటలు ఇతర భాషలకి చెందిన వాళ్లు అంత తేలికగా పలకలేరు అందుకే మాతృభాషకాని భాష నేర్చుకోవడంలో కొంత కష్టం వుంటుందని అందరమూ అంగీకరించక తప్పదు,అయితే అవసరం కోసం భాష నేర్చుకోవడం వేరు,ఆ భాషని ఇష్టపడి,ప్రేమించి,అందులోని స్వారస్యాన్ని గ్రహించి,అందులో రచనలు చేయడం,అవికూడా నేలబారువి కాకుండా,కాలానికి నిలిచేవి చేయడం చాలా గొప్ప విషయం.అది ఎంతో సృజనాత్మకత,ప్రతిభ,పరిశీలనా శక్తీ,ఏ విషయాన్నయినా మానవత్వంతో సమతూకంగా బేరీజు వేసే సామర్థ్యం వుంటే కానీ సాధ్యం కాదు. ఈ పై లక్షణాలన్నీ 'శారద' రచనలలో కనిపిస్తాయి అందుకే నాకా రచయిత పట్ల అపార గౌరవం నటరాజన్ తెలుగు నేర్చుకోవడం ఎలా మొదలు పెట్టాడంటే,మొట్టమొదట తురగా వెంకటేశ్వరరావు గారి దగ్గర చదవడం ,రాయడం నేర్చుకున్నాడు,అదే సమయంలో స్కూల్లో చదువుకుంటున్న తన మేనల్లుడు వెంకటేశ్వరరావు సహాయం కూడా తీసుకునే వాడు.అలా మూడో తరగతి వాచకం వరకూ,ఇంకా కొన్ని శతకాలూ ,చదివాక తన స్వయంకృషితో కనిపించిన పుస్తకమల్లా చదువుతూ, తెలియనివి పక్కన వున్న వారిని అడిగి తెలుసుకుంటూ స్వంతంగా కథల పుస్తకాలూ,నవలలూ చదివే స్థాయికి చేరుకున్నాడు.అదే చేత్తో రాయడం కూడా ప్రారంభించాడు. ఒక భాష పట్టుబడాలంటే అందులోని,మాటలూ,పాటలూ,నుడికారమూ,జాతీయాలూ ,హాస్యమూ ,తిట్లూఅన్నీ తెలియాలి.శారద ఇవన్నీ తెలుసుకున్నాడు,తెలుగు వారిలో తెలుగు వాడిగా జీవించాడు. తన స్నేహితుల ఇళ్లల్లో కూచుని గంటలు గంటలు మాట్లాడుతూ వుండేవాడు,వేములపల్లిశ్రీకృష్ణ "చేయెత్తి జైకొట్టు తెలుగోడా", పులుపుల శివయ్య "పలనాడు మనదిరా వెలనాడు మనదిరా" పాడుతుండే వాడు.శ్రీశ్రీ "మహాప్రస్థానం" కంఠోపాఠంగా వచ్చు ,యే సభలోనైనా అందులోంచి ఒక గేయం పాడే వాడు,ముఖ్యంగా "జగన్నాథ రథచక్రాలు".శ్యామలా దండకమూ,జయదేవ అష్టపదులూ కొట్టినపిండి అతనికి,అష్టపదుల్లో "సావిరహే తవదీనా" అంటే ఇష్టం,అతనిది మంచి గొంతు. ఘంటసాల ,రాజేశ్వరరావు,సూర్యకుమారి ప్రయివేట్ రికార్డులు"పుష్పవిలాపం "వగైరా పాడుతుండే వాడు. తెలుగు సినిమాలు చాలా చూసే వాడు, ఒకప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా "అల్లూరి సీతారామ రాజు" లాంటి సినిమాలు టెక్నికలర్ లో తీయాలని కలలు కనే వాడు,డైరెక్టర్ గా ఎల్ .వి.ప్రసాద్ నీ,సంగీతానికి రాజేశ్వరరావునీ తీసుకుందాం అనేవాడు. ఆయన ఇష్టపడ్డ సినిమాలు" వింధ్యరాణి,కీలుగుర్రం,పాతాళభైరవి,గుణసుందరి కథ,పెద్దమనుషులు"మొదలయినవి."రోజులు మారాయి "సినిమా చాలా ఇష్టం ,మఫ్ఫయి సార్లు చూశాడట. "షావుకారు"లో "పలుకరాదటే చిలకా" ఎప్పుడూ నోట్లో ఆడుతూ వుండేది హిందీ లో "అన్ మోల్ ఘడీ","లైలా మజ్నూ" సినిమాల పాటలన్నీ పాడుతూ వుండేవాడు తెలుగు భాగవత పద్యాలు కంఠతా పట్టాడు ,అందులో "శారద నీరదేందు,సిరికిం జెప్పడు" పద్యాలు అలవోకగా అప్పజెపుతూ వుండేవాడు(అందుకే శారద అనే కలం పేరు పెట్టుకున్నట్టున్నాడు).భారతం ,రామాయణం ఇతర పురాణ కథలూ తెలుసుకున్నాడు కాశీమజిలీ కథలూ,అరేబియన్ నైట్సూ ఇష్టంగా చదివేవాడు.అలెగ్జాండర్ డ్యూమాస్ "ది కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో,ఛార్లెస్ డికెన్స్ రెండు మహానగరాలు " అంటే అభిమానం అప్పట్లో వచ్చే దిన పత్రికలూ ,వార పత్రికలూ ,చందమామ ,ఆంధ్రజ్యోతి,ఆంధ్రప్రభ,జ్యోతి,రేరాణి,అభిసారిక ,డిటెక్టివ్ లూ మొదలయినవన్నీ చదివే వాడు.చేతిలో పైసా వుంటే పుస్తకాలు కొనడానికే ఖర్చు పెట్టేవాడు,లేనప్పుడు కనిపించిన వాళ్లనల్లా తెలుగు పుస్తకాలుంటే ఇవ్వండి చదివిచ్చేస్తానని అడిగేవాడు,కొన్ని పుస్తకాల స్టాళ్ల దగ్గరా,కిళ్లీబడ్డీల దగ్గరా నిలబడే పుస్తకాలు చదివేవాడు,ఆ బడ్డీల వాళ్లు కూడా అభిమానంగా చదవనిచ్చేవాళ్లు ,అంతేకాక "ఆంధ్ర రత్న లైబ్రరీ" కీ "మునిసిపల్ లైబ్రరీ" కీ కూడా క్రమం తప్పకుండా వెళ్లి చదువుకునే వాడు. కొవ్వలి నవలలూ,చలం,కుటుంబరావు,గోపీచంద్ దాదాపు అందరినీ చదువుకున్నాడు ,అయితే అతని మీద గాఢమైన ముద్ర వేసిన వారు చలం,ఆ తర్వాత కుటుంబరావు. చలం మ్యూజింగ్సూ,ప్రేమలేఖలూ చాలా ఇష్టం.ప్రేమలేఖల ప్రభావంతో ఎవరో ఒక వితంతువునుద్దేశించి "ఓ నా విశ్వ ప్రేయసీ" అని ప్రేమలేఖలు కూడా రాశాడు. తొలిరోజుల్లో చలాన్ని అనుకరిస్తూ రచనలు చేసే ఇతన్ని చూసి "నన్ను అనుకరించొద్దు నీ సొంత శైలి పెంపొందించుకో" అని చలం చెప్పినట్టు ఒక చోట చదివాను.కొద్దికాలంలోనే ఆ ప్రభావం నుండీ బయట పడ్డాడు. కుటుంబరావు రచనా విధానాన్నీ చాలా ఇష్టపడేవాడు రచనా వ్యాసంగం ప్రారంభించిన కొద్దికాలంలోనే రచన ఎలా వుండాలో ఒక నిర్దిష్టమయిన అభిప్రాయానికి రాగలిగాడు. "కథ చెప్పడం కాదు చూపాలి అనేవాడు,పాత్ర కళ్లముందుకు రావాలి అనేవాడు.ఆదర్శ అంతర్గతం గా కలిసిపోవాలి,కథంతా చదివిన పాఠకుడు తనంత తనే దాన్ని పట్టుకోవాలి"అనేవాడు----అంటారు ,ఆయన మోనోగ్రాఫ్ రాసిన "విహారి" గారు ఇక తన రచనా కాలంలో(1949) తానెదుర్కున్న సమస్యల గురించి ఆయన చెప్పిన మాటలొకసారి చూద్దాం నాదైన సమస్యలు---- నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు,ఈ చాకిరీ చేస్తూ,ఇట్లా ఆలోచనలు చేస్తే తొరగా చచ్చిపోతానని.కానీ హోటల్ చాకిరీ తప్పదు.చాకిరీకి తగినంత ఫలితమూ దక్కదు.పోనీ ఈ కథలు వ్రాయటం మానేద్దామా అనుకుంటాను.అదీ సాధ్యం కావటం లేదు.తెలుగు మాతృభాష కాకపోవటం వల్ల ఎంతో చదివితే గానీ,రచనా వ్యాసంగం సవ్యంగా సాగదు.అట్లా చదివేందుకు పుస్తకం కొనే ఓపిక లేదు.ఏ పుణ్యాత్ముడన్నా ఇస్తాడనుకుందాం,తీరిక గుర్రం కొమ్ములుగా వుంది(ఇకకడ కొ.కు గుర్తొచ్చాడు) ఇటీవల హోటల్ పనివాళ్లకు తెనాలిలో ఎనిమిది గంటల పని వచ్చిందన్నారు ,ఏ దారిని వచ్చిందో తెలియదు గానీ,నాతో సహా నూటికి తొంభైఅయిదు మందిమీ పది పన్నెండు గంటల ఎద్దు చాకిరీ చేస్తూనే వున్నాం.ఈ లక్షణంలో చదువెక్కడా?రాతఎక్కడా?ప్రభుత్వం శాసనాలు చేయడం కనిపిస్తుంది గానీ,అవి అమలు జరగడం కనిపించదు.పేరుకి లేబర్ ఆఫీసూ వుంది,ఆఫీసరూ వున్నాడు. హోటల్ సర్వరుకి చదువెందుకూ?అనే పెద్దమనుషులు చాలామంది ఎదురు పడ్డారు నాకు.సరైన గుడ్డలు నేను పుట్టిన తరువాత తొడిగి ఎరగను .ఈ హోటల్ పనికి గ్యారంటీ ఏమీలేదు. ఇప్పటికి పాతిక సార్లకి పైగా ఈ ఉద్యోగం ఊడిపోవటం,రోజుల తరబడి పస్తులుండటం జరిగింది.ఇక ముందు కూడా నా జీవితం ఇలా ఉండబోతుందనడంలో సంశయమే లేనప్పుడు మిగిలి వున్న జీవితకాలం ఎలా గడవబోతోందా అని తగని భయం వేస్తోంది.స్వతంత్రం వొచ్చాక ఇట్లా వుండదనుకున్నాను.కనీసం నా జీవిత ప్రయాణం వెనుకటికన్నా నూటికి ఇరవై పాళ్లన్నా పెరుగుతుందనుకున్నాను. పత్రికల వారు కథలు వ్రాస్తే ఇచ్చే డబ్బులు నా మూర్ఛల రోగాన్ని నయం చేసుకోడానికన్నా సరిపోతయ్యేమో అని సంతోషించాను.అదీ వట్టిదై పోయింది.ఈ పధ్ధతిలో నేను స్వతంత్ర భారత పౌరుణ్ణని భావించటంలో తప్పేమీ లేదనుకుంటాను." -------ఎస్ .నటరాజన్ (శారద)తెలుగు స్వతంత్ర18-2-1949 చూశారుగా "శారద" ఎన్ని కష్టాలు పడుతూ రచనా వ్యాసంగం కొనసాగించాడో.......
తెనాలిలో అడుగు పెట్టి ,హోటల్ సర్వర్ గా పని మొదలు పెట్టిన ఒకటి రెండేళ్ల లోపే పితృ వియోగం కలిగింది నటరాజన్ కి ,అది అతనిని మానసికంగా చాలా కృంగ దీసింది.తండ్రి దహన క్రియలు జరిగిన రాత్రే అతను మూర్ఛ  వచ్చి ,బావ భీమారావు హోటల్ బయట మురుగ్గుంట పక్కన పడిపోయాడు,తెల్లారే దాకా ఎవరూ చూడలేదు.

అప్పుడు పట్టుకున్న ఆ జబ్బు అతని చనిపోయే దాకా వదల్లేదు.ఒక రకంగా అతని చావుకు కూడా కారణమయింది.ఒకసారి వంటచేస్తూ ,మూర్ఛవచ్చి పొయ్యిలో పడి ఒళ్లంతా కాలి చాలా బాధపడ్డాడు,ఇంకోసారి ఎలక్ట్రిక్ పోల్ కి గుద్దుకున్నాడు.మానసికంగా,శారీరకంగా ప్రశాంతంగా వున్నప్పుడు నాలుగయిదు నెలలపాటు దాని జాడే వుండేది కాదు.

తండ్రిని కోల్పోయిన నటరాజన్ ని అక్క సుందరమ్మ .కళ్లల్లో పెట్టుకుని కాపాడేది
బావ భీమా రావు హోటల్లో సర్వర్ గా పని చేస్తుండే వాడు కదా,పని మధ్యలో సాహిత్యమనీ,సంగీతమనీ సమయం వృథా చేస్తున్నాడని భీమారావుకి గుర్రు గా వుండేది.అతన్ని చీటికీ మాటికీ తిట్టటం దండించడం చేస్తుండే వాడు,నటరాజన్ ఇదంతా నవ్వులాటగా తీసేసే వాడు,కానీ భరించలేనప్పుడు పని వదిలేసి వెళ్లి పోయి వేరే హోటల్లో చేరేవాడు.
ఎక్కడయినా సరే యజమానులు పనివాళ్లు ఎంత చాకిరీ చేసినా  ఊరుకుంటారు కానీ  చదువూ,సంధ్యా అని చుట్టుపక్కల వారిని చేరదీస్తుంటే కంటగింపుగి వుండదా మరి

అందుకే నటరాజన్ అనేక హోటళ్లు మారాడు,తెనాలిలో అతను పనిజేయని హోటల్ లేదంటే అతిశయోక్తి కాదు.బావ భీమారావు హోటల్లో కొన్నాళ్లు పనిచేయడం ,మళ్లీ మానేసి వేరే హోటల్లో పని చేసి ,తిరిగి ఆయన దగ్గరకు రావడం అలా జరుగుతూ వుండేది.
సర్వర్ పని నుండీ తప్పించుకుని వంట నేర్చుకుని "సరుకు మాస్టర్ "అయ్యాడు (ప్రధాన వంటవాడు)

ఈ మార్పుతో అతనికి చదువు కోవడానికీ రాసుకోవడానికీ ఎక్కువ సమయం దొరికేది.అలా సుమారు అయిదారేళ్లు గడిచేసరికి ,అతనికి తెలుగులో రాయడమూ చదవడమూ  రావడమే కాదు,సాహిత్యంలో మంచి ప్రవేశం దొరికింది.

అతని చుట్టూ చక్కని స్నేహబృందం యేర్పడింది.ఆలూరి భుజంగరావు,అతని అన్న ప్రకాశ రావు,రావూరి భరద్వాజ,ముక్కామల మల్లిఖార్జున రావు,అబ్బరాజు నాగభూషణం ,గొన్నాబత్తుల వెంకటేశ్వరరావు అతని స్నేహబృందంలో ముఖ్యులు.

అతను  తన స్నేహితులని కూడా పుస్తకాలు ,చదవమనీ రాయమనీ ప్రోత్సహించే వాడు,తాను చదివిన పుస్తకాల్లోని కథలు వారికి చెబుతుండేవాడు.అలా స్నేహబృందంలోని ఆలూరిభుజంగరావు,ప్రకాశమూ,రావూరి భరద్వాజ రచనలు చేయడం మొదలు పెట్టారు.

వీరి అభిరుచి పెంపొందడానికి కళలకు కాణాచి అయిన తెనాలి కళావాతావరణం కూడా దోహదం చేసింది.
1944-46 ప్రాంతాలలో  కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రభావమూ,తెలంగాణా ఉద్యమ ప్రభావమూ,దేశ రాజకీయ పరిస్థితులూ కూడా నటరాజన్ వ్యక్తిత్వం తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగ పడ్డాయి. .
సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలగురించీ,పీడిత జనుల బాధల గురించీ,దగా పడిన స్త్రీల దుర్భర జీవితాల గురించి ఒక అవగాహన యేర్పడింది.ఇవన్నీ అతని రచనల్లో ప్రతిబింబించాయి.
1946లో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో పెదపూడిలో నిర్వహించిన సాహిత్య పాఠశాలలో పాల్గొనడం ,అతనికి చాలా మేలు చేసింది.ఆ సభల్లో పాల్గొన్న శ్రీశ్రీ,కుటుంబరావు,మల్లంపల్లి సోమశేఖర శర్మ,పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి,నిడదవోలు వెంకట్రావు  మొదలయిన వారి ఉపన్యాసాలూ,శిక్షణా తరగతులు అతనిని మరింత ఉత్తేజితం చేశాయి,ఈ సభలలో అతని తో పాటు ఆలూరి భుజంగ రావు అన్న ప్రకాశం కూడా పాల్గొన్నాడు.

అతని రచనా వ్యాసంగం మరింత మెరుగుపడింది,అతను మిత్రులందరితో కలిసి ఒక లిఖిత పత్రిక"ప్రజావాణి" అనే పేరుతో వెలువరించాడు,దీనికి స్ఫూర్తి తాపీ ధర్మారావు గారి "జన వాణి".
1946 సంవత్సరంలోనే "ప్రజాశక్తి" లో అతని వ్యంగ్య రచన "ప్రపంచానికి జబ్బుచేసింది" ఎస్ .నటరాజన్ పేరుతో ప్రచురించ బడింది,అదే అతని మొదటి రచన
 అప్పటి నుండీ అతను ధ్యాసంతా రచన మీదే వుండేది యేమాత్రం ఖాళీ దొరికినా,చేతి కందిన చిత్తుకాగితాల మీద ,తనకి వచ్చిన ఆలోచనలు రాసుకునే వాడు.
అతను రాసుకోవడానికి గొన్నాబత్తుల సోమలింగాచారి బంగారు దుకాణమూ,గడియారాలు రిపేరు చేసే మస్తాను సాయిబు దుకాణమూ ఆవాసాలుగా వుండేవి ,అక్కడ అతనిని నిరోధించే వారెవరూ వుండేవారు కారు.,పైగా కావలసిన టీలూ ,టిఫిన్లూ సప్లయ్ అవుతూ వుండేవి.

బొంతా అచ్యుత రావుగారి కుటుంబమూ,గొన్నాబత్తుల సోమలింగా చారి కుటుంబమూ నటరాజన్ కి ఆశ్రయమిచ్చిన  వారిలో ముఖ్యులు,"మల్లిఖార్జున రావు లేక పోతే శారద లేడు "అంటారు ఆలూరి భుజంగరావు.
1948 జనవరి లో ఆల పాటి రవీంద్రనాధ్ గారి "జ్యోతి" పత్రికలో "గొప్పవాడి భార్య" అనే వ్యంగ్య కథ "శారద" పేరుతో ప్రచురింపబడింది.అది మహాత్ముని భార్య కస్తూర్ బా ని దృష్టిలో పెట్టుకుని రాసింది,( అదే సమయంలో మహాత్ముడు హత్యకు గురవ్వడం ఒక విచిత్రమైన విషాదం)
అప్పటినుండీ నటరాజన్ "శారద" పేరుతోనే రాయడం మొదలు పెట్టి పాప్యులర్ అయ్యాడు.

అతను "గంధర్వ" ,"శక్తి" అనే కలం పేర్లతో కూడా రాసే వాడు కానీ అవి అంత పాప్యులర్ అవ్వలేదు
ఆలూరి ప్రకాశం తోనూ ఇతర స్నేహితులతో కలిసి "చంద్రిక" అనే పత్రికతీసుకు రావాలని కలలు కని బెజవాడలోని లక్ష్మీపతి  పంత్ సహాయంతో మొదటి ప్రతి తెచ్చాడు ,అందులో వివిధ కలం పేర్లతో అతనే చాలా శీర్షికలకి రచనలు చేశాడు ముఖచిత్రం వడ్డాది పాపయ్య,అయితే అది ఒక్క సంచిక తోనే ఆగి పోయింది.అది వెలువడక ముందే ప్రకాశం మరణించాడు..

1950ప్రాంతాల నుండీ అతను విరివిగా రచనలు చేయసాగాడు,అతని రచనలని "జ్యోతి,తెలుగు స్వతంత్ర,ఆంధ్ర పత్రిక,ఆంధ్ర జ్యోతి,ఆంధ్రప్రభ "మొదలయిన పత్రికలు ప్రచురించ సాగాయి.
కథలే కాదు,నవలలు,గల్పికలు,వ్యంగ్య కథనాలు కూడా రాయసాగాడు.డబ్బులకోసం డిటెక్టివ్ కథలు రాశాడు,కొన్ని తమిళ కథలు అనువాదం చేశాడు,రామ్మూర్తి అనే మిత్రుడితో కలిసి "థెరిసా" అనే నవల ఇంగ్లీషు నుండీ తెలుగు లోకి అనువదించాడట.

అలా 1950నుండీ 1955వరకూ రచనా వ్యాసంగం కొనసాగింది.

ఇదిలా వుండగా 1949-50 ప్రాంతాలలో అతనికి పెళ్లి అయింది,వధువు బెజవాడకు చెందిన మళయాళీ అమ్మాయి ,వితంతువు.ఈ సంబంధం అతని అన్న చంద్ర శేఖరన్ కుదిర్చింది అతను ఇష్టపడే చేసుకున్నాడు,ఆమె పేరు అన్నపూర్ణ. పెళ్లి  జరిగిందిచిదంబరం నటరాజ స్వామి గుళ్లో, దండల పెళ్లి ,తర్వాత రిజిస్టర్ చేయించుకున్నారు.
రచనా వ్యాసంగానికి కుటుంబ భారం తోడయింది,చుట్టుముట్టే ఆర్థిక సమస్యల నుండీ బయట పడటానికి రక రకాల ఉద్యోగాలు చేశాడు
కొన్నాళ్లు ఆలపాటి రవీంద్రనాథ్ గారు నడిపే "జ్యోతి "పత్రికలో పని చేశాడు.కొన్నాళ్లు చిన్న టిక్కీ హోటల్ నడిపాడు,కొన్నాళ్లు ఊరికి దూరంగా బుర్రి పాలెంలో టీ బంక్ నడిపాడు,మునిసి పాలిటీ వారి బాధ భరించలేక అది ఎత్తేసాడు.కొన్ని రోజులు బస్టాండులో పాత పత్రిలు ,పేపర్లూ అమ్మాడు,ఇంకొన్నాళ్లు మజ్జిగ గ్లాసు అణా చొప్పున అమ్మాడు,కొన్ని రోజులు తెలిసిన వాళ్ల బట్టలషాపు ముందు అరుగు మీద గారెల కళాయి పెట్టి మసాలా గారెలూ,బజ్జీలూ అమ్మాడు.మధ్యమధ్యలో హోటల్ పని వుండనే వుంది .ఏ పని చేస్తున్నా ఒక చేతిలో చిత్తుకాగితాల బొత్తి క్లిప్ కి పెట్టిన అట్ట వుండేది,ఇంకో చేతిలో బీడీ వుండేది.ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు రాస్తూ వుండేవాడు,
"మంచీ-చెడూ"సీరియల్ గా ఆంధ్రపత్రికలో వస్తున్నప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది,ఆ తర్వాత "అపస్వరాలు" కూడా పత్రికలోనే సీరియల్ గా వచ్చింది,అతని ఇతర నవలలు "ఏది సత్యం?",సరళాదేవి హత్య,అందాల దీవి,మహీపతి",దాదాపు వంద వరకూ కథలు రాశాడు,అందులో కొన్ని "రక్తస్పర్శ"పేరుతో కథల సంపుటిగా వచ్చాయి.అతని సాహిత్య జీవితం తృప్తికరంగానే వున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే వుంది

 అప్పటికే ఇద్దరు మగ పిల్లలు కలిగారు పెద్దబ్బాయి సుబ్రహ్మణ్యం,రెండో అబ్బాయి రాధాకృష్ణ ,భార్య మళ్లీ కడుపుతో వుంది.
అది 1955సం" ఆగస్ట్ పదిహేడో తారీఖు ,ఆ రోజు సాయంత్రం మామూలుగానే బజారుకెళ్లి మల్లిఖార్జున రావు  తో బాటు హోటల్ కెళ్లి కాఫీ తాగాడు,భోజనం చేయమంటే "వద్దు ఆడబ్బులు పదణాలూ ఇస్తే రేపు పొద్దున కాఫీకి వుంచుకుంటాను" అన్నాడు,అతను పదణాలూ ఇస్తే జేబులో వేసుకుని ,అతనిని  రైల్వే స్టేషన్ లో నెల్లూరు బండెక్కించి ,ఇంటికొచ్చి స్నానం చేసి భోజనం చేస్తూ తనకి ఒంట్లో బాగా లేదు అన్నాడు,భార్య కానుపుకోసం,కనిపెట్టుకు వుండటానికి వచ్చిన అక్కగారితో.భోజనం చేసి పడుకో అన్నదామె ,సరే అంటూ బీడీ కోసం ,వంకీకీ తగిలించిన చొక్కా జేబులో చెయ్యి పెడుతూనే విరుచుకు పడిపోయాడు మూర్ఛతో ,అతను ఆఖరి సారిగా అన్నమాట "జాగ్రత్త జాగ్రత్త" ,అంతే .
అతికొద్ది కాలం లోనే తెలుగు సాహిత్య రంగాన్ని ఓ కాపు కాసిన జ్యోతి ఆరిపోయింది.అతని జేబులో మిత్రుడిచ్చిన పదణాలు తప్ప  ఇంట్లో చిల్లిగవ్వ లేదు.మిత్రులు చందాలు వేసుకుని  అంత్య క్రియలు జరిపించారు.

ఆయన పోయిన నెలరోజులకి అన్నపూర్ణ ఆడపిల్లను ప్రసవించింది, ఆ పిల్లకు శారద అనే పేరు పెట్టుకుంది
 ముగ్గురు పిల్లలతో,పేదరికంతో ,భర్త లేని ఒంటరి ఆడది ఎన్ని కష్టాలు పడుతుందో అన్ని కష్టాలూ పడింది.తర్వాత నందిరాజు ఉమామహేశ్వరరావు అనే ఆయన్ని పెళ్లి చేసుకుని తెనాలి నుండీ వెళ్లిపోయి ఆ ఊరూ ఈ ఊరూ తిరిగి చివరకు నల్గొండలో స్థిరపడ్డారు.తెనాలి వదిలేసేటప్పుడు రెండోకొడుకు రాధాకృష్ణని ,తెనాలిలోనే ఒక కుటుంబానికి పెంచుకోవడానికి ఇచ్చింది.
ఇప్పుడు అన్నపూర్ణ కూడా లేదు అయితే పెద్ద కొడుకు నందిరాజు సుబ్రమణ్యం తిరుపతి లో వుంటున్నారు,రెండో కొడుకు నూతలపాటి రాధాకృష్ణ తెనాలిలో వుంటున్నారు ,కూతురు శారద కూడా తెనాలి లోనే వుంటున్నారు ."శారద" మనుమలు ,మనవరాళ్లూ చక్కగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. (శారద మరణానంతరం జరిగిన కథంతా తెనాలి జర్నలిస్ట్ శ్రీ బి.యల్ నారాయణ గారి ద్వారా తెలుసుకున్నాను.వారు రాసిన పేపర్ కటింగ్ కూడా లింక్ ఇస్తున్నాను)

శారద మరణించి అరవై అయిదు సంవత్సరాలయినా ఆయన రచనల ను వెదుక్కుని చదివే వారున్నారు,ఆయన నవల "మంచీ-చెడూ" బి.ఏ లో పాఠ్యాంశంగా పెట్టారు.
ఆయన రచనల మీద కొంత మంది యం.ఫిల్ చేశారని,చేస్తున్నారని విన్నాను
ముఫ్ఫయి రెండేళ్ల చిన్న జీవితంలో, దుర్భర దారిద్ర్యంలో  మగ్గుతూ కూడా,కేవలం ఆరేడే ళ్ల రచనా కాలంలో,అతను సృష్టించిన కాలానికి నిలబడే అమూల్య మైన సాహిత్యం చూస్తే చాలాఆశ్చర్యంగా వుంటుంది నాకు
నిజానికి ఆయన  జీవితం నుండీ నేర్చుకోదగిన అంశా లెన్నో వున్నాయనిపిస్తుంది.
మానవుని జీవితం అశాశ్వతం,అక్షరం శాశ్వతం
నటరాజన్ మరణించి వుండవచ్చు ,కానీ"శారద"కు మరణం లేదు.,ఆ విధంగా "శారద" చిరంజీవి.

------భార్గవి