అప్పుడు పట్టుకున్న ఆ జబ్బు అతని చనిపోయే దాకా వదల్లేదు.ఒక రకంగా అతని చావుకు కూడా కారణమయింది.ఒకసారి వంటచేస్తూ ,మూర్ఛవచ్చి పొయ్యిలో పడి ఒళ్లంతా కాలి చాలా బాధపడ్డాడు,ఇంకోసారి ఎలక్ట్రిక్ పోల్ కి గుద్దుకున్నాడు.మానసికంగా,శారీరకంగా ప్రశాంతంగా వున్నప్పుడు నాలుగయిదు నెలలపాటు దాని జాడే వుండేది కాదు.
తండ్రిని కోల్పోయిన నటరాజన్ ని అక్క సుందరమ్మ .కళ్లల్లో పెట్టుకుని కాపాడేది
బావ భీమా రావు హోటల్లో సర్వర్ గా పని చేస్తుండే వాడు కదా,పని మధ్యలో సాహిత్యమనీ,సంగీతమనీ సమయం వృథా చేస్తున్నాడని భీమారావుకి గుర్రు గా వుండేది.అతన్ని చీటికీ మాటికీ తిట్టటం దండించడం చేస్తుండే వాడు,నటరాజన్ ఇదంతా నవ్వులాటగా తీసేసే వాడు,కానీ భరించలేనప్పుడు పని వదిలేసి వెళ్లి పోయి వేరే హోటల్లో చేరేవాడు.
ఎక్కడయినా సరే యజమానులు పనివాళ్లు ఎంత చాకిరీ చేసినా ఊరుకుంటారు కానీ చదువూ,సంధ్యా అని చుట్టుపక్కల వారిని చేరదీస్తుంటే కంటగింపుగి వుండదా మరి
అందుకే నటరాజన్ అనేక హోటళ్లు మారాడు,తెనాలిలో అతను పనిజేయని హోటల్ లేదంటే అతిశయోక్తి కాదు.బావ భీమారావు హోటల్లో కొన్నాళ్లు పనిచేయడం ,మళ్లీ మానేసి వేరే హోటల్లో పని చేసి ,తిరిగి ఆయన దగ్గరకు రావడం అలా జరుగుతూ వుండేది.
సర్వర్ పని నుండీ తప్పించుకుని వంట నేర్చుకుని "సరుకు మాస్టర్ "అయ్యాడు (ప్రధాన వంటవాడు)
ఈ మార్పుతో అతనికి చదువు కోవడానికీ రాసుకోవడానికీ ఎక్కువ సమయం దొరికేది.అలా సుమారు అయిదారేళ్లు గడిచేసరికి ,అతనికి తెలుగులో రాయడమూ చదవడమూ రావడమే కాదు,సాహిత్యంలో మంచి ప్రవేశం దొరికింది.
అతని చుట్టూ చక్కని స్నేహబృందం యేర్పడింది.ఆలూరి భుజంగరావు,అతని అన్న ప్రకాశ రావు,రావూరి భరద్వాజ,ముక్కామల మల్లిఖార్జున రావు,అబ్బరాజు నాగభూషణం ,గొన్నాబత్తుల వెంకటేశ్వరరావు అతని స్నేహబృందంలో ముఖ్యులు.
అతను తన స్నేహితులని కూడా పుస్తకాలు ,చదవమనీ రాయమనీ ప్రోత్సహించే వాడు,తాను చదివిన పుస్తకాల్లోని కథలు వారికి చెబుతుండేవాడు.అలా స్నేహబృందంలోని ఆలూరిభుజంగరావు,ప్రకాశమూ,రావూరి భరద్వాజ రచనలు చేయడం మొదలు పెట్టారు.
వీరి అభిరుచి పెంపొందడానికి కళలకు కాణాచి అయిన తెనాలి కళావాతావరణం కూడా దోహదం చేసింది.
1944-46 ప్రాంతాలలో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రభావమూ,తెలంగాణా ఉద్యమ ప్రభావమూ,దేశ రాజకీయ పరిస్థితులూ కూడా నటరాజన్ వ్యక్తిత్వం తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగ పడ్డాయి. .
సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలగురించీ,పీడిత జనుల బాధల గురించీ,దగా పడిన స్త్రీల దుర్భర జీవితాల గురించి ఒక అవగాహన యేర్పడింది.ఇవన్నీ అతని రచనల్లో ప్రతిబింబించాయి.
1946లో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో పెదపూడిలో నిర్వహించిన సాహిత్య పాఠశాలలో పాల్గొనడం ,అతనికి చాలా మేలు చేసింది.ఆ సభల్లో పాల్గొన్న శ్రీశ్రీ,కుటుంబరావు,మల్లంపల్లి సోమశేఖర శర్మ,పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి,నిడదవోలు వెంకట్రావు మొదలయిన వారి ఉపన్యాసాలూ,శిక్షణా తరగతులు అతనిని మరింత ఉత్తేజితం చేశాయి,ఈ సభలలో అతని తో పాటు ఆలూరి భుజంగ రావు అన్న ప్రకాశం కూడా పాల్గొన్నాడు.
అతని రచనా వ్యాసంగం మరింత మెరుగుపడింది,అతను మిత్రులందరితో కలిసి ఒక లిఖిత పత్రిక"ప్రజావాణి" అనే పేరుతో వెలువరించాడు,దీనికి స్ఫూర్తి తాపీ ధర్మారావు గారి "జన వాణి".
1946 సంవత్సరంలోనే "ప్రజాశక్తి" లో అతని వ్యంగ్య రచన "ప్రపంచానికి జబ్బుచేసింది" ఎస్ .నటరాజన్ పేరుతో ప్రచురించ బడింది,అదే అతని మొదటి రచన
అప్పటి నుండీ అతను ధ్యాసంతా రచన మీదే వుండేది యేమాత్రం ఖాళీ దొరికినా,చేతి కందిన చిత్తుకాగితాల మీద ,తనకి వచ్చిన ఆలోచనలు రాసుకునే వాడు.
అతను రాసుకోవడానికి గొన్నాబత్తుల సోమలింగాచారి బంగారు దుకాణమూ,గడియారాలు రిపేరు చేసే మస్తాను సాయిబు దుకాణమూ ఆవాసాలుగా వుండేవి ,అక్కడ అతనిని నిరోధించే వారెవరూ వుండేవారు కారు.,పైగా కావలసిన టీలూ ,టిఫిన్లూ సప్లయ్ అవుతూ వుండేవి.
బొంతా అచ్యుత రావుగారి కుటుంబమూ,గొన్నాబత్తుల సోమలింగా చారి కుటుంబమూ నటరాజన్ కి ఆశ్రయమిచ్చిన వారిలో ముఖ్యులు,"మల్లిఖార్జున రావు లేక పోతే శారద లేడు "అంటారు ఆలూరి భుజంగరావు.
1948 జనవరి లో ఆల పాటి రవీంద్రనాధ్ గారి "జ్యోతి" పత్రికలో "గొప్పవాడి భార్య" అనే వ్యంగ్య కథ "శారద" పేరుతో ప్రచురింపబడింది.అది మహాత్ముని భార్య కస్తూర్ బా ని దృష్టిలో పెట్టుకుని రాసింది,( అదే సమయంలో మహాత్ముడు హత్యకు గురవ్వడం ఒక విచిత్రమైన విషాదం)
అప్పటినుండీ నటరాజన్ "శారద" పేరుతోనే రాయడం మొదలు పెట్టి పాప్యులర్ అయ్యాడు.
అతను "గంధర్వ" ,"శక్తి" అనే కలం పేర్లతో కూడా రాసే వాడు కానీ అవి అంత పాప్యులర్ అవ్వలేదు
ఆలూరి ప్రకాశం తోనూ ఇతర స్నేహితులతో కలిసి "చంద్రిక" అనే పత్రికతీసుకు రావాలని కలలు కని బెజవాడలోని లక్ష్మీపతి పంత్ సహాయంతో మొదటి ప్రతి తెచ్చాడు ,అందులో వివిధ కలం పేర్లతో అతనే చాలా శీర్షికలకి రచనలు చేశాడు ముఖచిత్రం వడ్డాది పాపయ్య,అయితే అది ఒక్క సంచిక తోనే ఆగి పోయింది.అది వెలువడక ముందే ప్రకాశం మరణించాడు..
1950ప్రాంతాల నుండీ అతను విరివిగా రచనలు చేయసాగాడు,అతని రచనలని "జ్యోతి,తెలుగు స్వతంత్ర,ఆంధ్ర పత్రిక,ఆంధ్ర జ్యోతి,ఆంధ్రప్రభ "మొదలయిన పత్రికలు ప్రచురించ సాగాయి.
కథలే కాదు,నవలలు,గల్పికలు,వ్యంగ్య కథనాలు కూడా రాయసాగాడు.డబ్బులకోసం డిటెక్టివ్ కథలు రాశాడు,కొన్ని తమిళ కథలు అనువాదం చేశాడు,రామ్మూర్తి అనే మిత్రుడితో కలిసి "థెరిసా" అనే నవల ఇంగ్లీషు నుండీ తెలుగు లోకి అనువదించాడట.
అలా 1950నుండీ 1955వరకూ రచనా వ్యాసంగం కొనసాగింది.
ఇదిలా వుండగా 1949-50 ప్రాంతాలలో అతనికి పెళ్లి అయింది,వధువు బెజవాడకు చెందిన మళయాళీ అమ్మాయి ,వితంతువు.ఈ సంబంధం అతని అన్న చంద్ర శేఖరన్ కుదిర్చింది అతను ఇష్టపడే చేసుకున్నాడు,ఆమె పేరు అన్నపూర్ణ. పెళ్లి జరిగిందిచిదంబరం నటరాజ స్వామి గుళ్లో, దండల పెళ్లి ,తర్వాత రిజిస్టర్ చేయించుకున్నారు.
రచనా వ్యాసంగానికి కుటుంబ భారం తోడయింది,చుట్టుముట్టే ఆర్థిక సమస్యల నుండీ బయట పడటానికి రక రకాల ఉద్యోగాలు చేశాడు
కొన్నాళ్లు ఆలపాటి రవీంద్రనాథ్ గారు నడిపే "జ్యోతి "పత్రికలో పని చేశాడు.కొన్నాళ్లు చిన్న టిక్కీ హోటల్ నడిపాడు,కొన్నాళ్లు ఊరికి దూరంగా బుర్రి పాలెంలో టీ బంక్ నడిపాడు,మునిసి పాలిటీ వారి బాధ భరించలేక అది ఎత్తేసాడు.కొన్ని రోజులు బస్టాండులో పాత పత్రిలు ,పేపర్లూ అమ్మాడు,ఇంకొన్నాళ్లు మజ్జిగ గ్లాసు అణా చొప్పున అమ్మాడు,కొన్ని రోజులు తెలిసిన వాళ్ల బట్టలషాపు ముందు అరుగు మీద గారెల కళాయి పెట్టి మసాలా గారెలూ,బజ్జీలూ అమ్మాడు.మధ్యమధ్యలో హోటల్ పని వుండనే వుంది .ఏ పని చేస్తున్నా ఒక చేతిలో చిత్తుకాగితాల బొత్తి క్లిప్ కి పెట్టిన అట్ట వుండేది,ఇంకో చేతిలో బీడీ వుండేది.ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు రాస్తూ వుండేవాడు,
"మంచీ-చెడూ"సీరియల్ గా ఆంధ్రపత్రికలో వస్తున్నప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది,ఆ తర్వాత "అపస్వరాలు" కూడా పత్రికలోనే సీరియల్ గా వచ్చింది,అతని ఇతర నవలలు "ఏది సత్యం?",సరళాదేవి హత్య,అందాల దీవి,మహీపతి",దాదాపు వంద వరకూ కథలు రాశాడు,అందులో కొన్ని "రక్తస్పర్శ"పేరుతో కథల సంపుటిగా వచ్చాయి.అతని సాహిత్య జీవితం తృప్తికరంగానే వున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే వుంది
అప్పటికే ఇద్దరు మగ పిల్లలు కలిగారు పెద్దబ్బాయి సుబ్రహ్మణ్యం,రెండో అబ్బాయి రాధాకృష్ణ ,భార్య మళ్లీ కడుపుతో వుంది.
అది 1955సం" ఆగస్ట్ పదిహేడో తారీఖు ,ఆ రోజు సాయంత్రం మామూలుగానే బజారుకెళ్లి మల్లిఖార్జున రావు తో బాటు హోటల్ కెళ్లి కాఫీ తాగాడు,భోజనం చేయమంటే "వద్దు ఆడబ్బులు పదణాలూ ఇస్తే రేపు పొద్దున కాఫీకి వుంచుకుంటాను" అన్నాడు,అతను పదణాలూ ఇస్తే జేబులో వేసుకుని ,అతనిని రైల్వే స్టేషన్ లో నెల్లూరు బండెక్కించి ,ఇంటికొచ్చి స్నానం చేసి భోజనం చేస్తూ తనకి ఒంట్లో బాగా లేదు అన్నాడు,భార్య కానుపుకోసం,కనిపెట్టుకు వుండటానికి వచ్చిన అక్కగారితో.భోజనం చేసి పడుకో అన్నదామె ,సరే అంటూ బీడీ కోసం ,వంకీకీ తగిలించిన చొక్కా జేబులో చెయ్యి పెడుతూనే విరుచుకు పడిపోయాడు మూర్ఛతో ,అతను ఆఖరి సారిగా అన్నమాట "జాగ్రత్త జాగ్రత్త" ,అంతే .
అతికొద్ది కాలం లోనే తెలుగు సాహిత్య రంగాన్ని ఓ కాపు కాసిన జ్యోతి ఆరిపోయింది.అతని జేబులో మిత్రుడిచ్చిన పదణాలు తప్ప ఇంట్లో చిల్లిగవ్వ లేదు.మిత్రులు చందాలు వేసుకుని అంత్య క్రియలు జరిపించారు.
ఆయన పోయిన నెలరోజులకి అన్నపూర్ణ ఆడపిల్లను ప్రసవించింది, ఆ పిల్లకు శారద అనే పేరు పెట్టుకుంది
ముగ్గురు పిల్లలతో,పేదరికంతో ,భర్త లేని ఒంటరి ఆడది ఎన్ని కష్టాలు పడుతుందో అన్ని కష్టాలూ పడింది.తర్వాత నందిరాజు ఉమామహేశ్వరరావు అనే ఆయన్ని పెళ్లి చేసుకుని తెనాలి నుండీ వెళ్లిపోయి ఆ ఊరూ ఈ ఊరూ తిరిగి చివరకు నల్గొండలో స్థిరపడ్డారు.తెనాలి వదిలేసేటప్పుడు రెండోకొడుకు రాధాకృష్ణని ,తెనాలిలోనే ఒక కుటుంబానికి పెంచుకోవడానికి ఇచ్చింది.
ఇప్పుడు అన్నపూర్ణ కూడా లేదు అయితే పెద్ద కొడుకు నందిరాజు సుబ్రమణ్యం తిరుపతి లో వుంటున్నారు,రెండో కొడుకు నూతలపాటి రాధాకృష్ణ తెనాలిలో వుంటున్నారు ,కూతురు శారద కూడా తెనాలి లోనే వుంటున్నారు ."శారద" మనుమలు ,మనవరాళ్లూ చక్కగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. (శారద మరణానంతరం జరిగిన కథంతా తెనాలి జర్నలిస్ట్ శ్రీ బి.యల్ నారాయణ గారి ద్వారా తెలుసుకున్నాను.వారు రాసిన పేపర్ కటింగ్ కూడా లింక్ ఇస్తున్నాను)
శారద మరణించి అరవై అయిదు సంవత్సరాలయినా ఆయన రచనల ను వెదుక్కుని చదివే వారున్నారు,ఆయన నవల "మంచీ-చెడూ" బి.ఏ లో పాఠ్యాంశంగా పెట్టారు.
ఆయన రచనల మీద కొంత మంది యం.ఫిల్ చేశారని,చేస్తున్నారని విన్నాను
ముఫ్ఫయి రెండేళ్ల చిన్న జీవితంలో, దుర్భర దారిద్ర్యంలో మగ్గుతూ కూడా,కేవలం ఆరేడే ళ్ల రచనా కాలంలో,అతను సృష్టించిన కాలానికి నిలబడే అమూల్య మైన సాహిత్యం చూస్తే చాలాఆశ్చర్యంగా వుంటుంది నాకు
నిజానికి ఆయన జీవితం నుండీ నేర్చుకోదగిన అంశా లెన్నో వున్నాయనిపిస్తుంది.
మానవుని జీవితం అశాశ్వతం,అక్షరం శాశ్వతం
నటరాజన్ మరణించి వుండవచ్చు ,కానీ"శారద"కు మరణం లేదు.,ఆ విధంగా "శారద" చిరంజీవి.
------భార్గవి