రాలిన మొగ్గలు - తమిళ సాహితీ తెలుగు వి‘శారద’ written by - ఆకెళ్ల రాఘవేంద్ర ---sakshi sunday book on 26 aug 2012
‘శారద చచ్చిపోయాట్ట’ - తెనాలినంతా కప్పేసిందా మాట రాత్రికి రాత్రే. ఒకరా ఇద్దరా - పదులు, వందల్లో వచ్చారు జనం. 32 ఏళ్ల శారద శవమై పడున్నాడు. వెక్కివెక్కి ఏడవనివారు లేరక్కడ. ‘ఎక్కడో అరవ దేశం నుంచొచ్చాడు. పాపం’ అనుకున్నారొకరు. ‘ఏం సుఖపడ్డాడు శారద? ఎప్పుడూ పస్తులు, దరిద్రమే. పైగా మూర్ఛ రోగమొకటి’ - ఒకరి గుండె మూలిగింది. ‘తెనాలొచ్చాకే తెలుగు నేర్చుకున్నాడు. తెలుగులో కథలూ నవలలూ రాశాడు. హోటల్లో సర్వరుగా పనిచేయడమేమిటి? సాహిత్యంపై ఆ పట్టు ఏమిటి?’ ఆశ్చర్యంతో దుఃఖించాడో మిత్రుడు. తమిళుడే అయినా, ఆకలీ రోగమూ బాధించినా, తెలుగు నవల, కథల్ని అందంగా వండి వార్చిన సాహితీవేత్త సుబ్రహ్మణ్యయ్యర్ నటరాజన్. ఆయన కలం పేరు ‘శారద’.
తెనాలి మారీస్‌పేట బస్టాండ్ దగ్గర రాధాకృష్ణ విలాస్ అనే హోటలుంది. అది ఎల్లాప్రగడ భీమారావుది. నటరాజన్ అందులో సర్వర్. కాఫీ కప్పులు తీయడం, టేబుళ్లు తుడవడం, ఎంగిలి ప్లేట్లు కడగడం. అప్పటికి నటరాజన్‌కి పన్నెండేళ్లు. భీమారావెవరో కాదు, ఆ కుర్రాడికి స్వయానా అక్క మొగుడే. నటరాజన్ పుట్టింది తమిళనాడులోని పుదుక్కోటలో 1924లో. నటరాజన్‌కి రెండేళ్లున్నప్పుడే తల్లి భాగీరథి చనిపోయింది. తండ్రి సుబ్రహ్మణ్యయ్యర్ కటిక దరిద్రం అనుభవించాడు. చెన్నపట్టణంలో బతకలేని స్థితి. దాంతో కొడుకుని వెంటబెట్టుకుని తెనాలొచ్చేశాడు - అల్లుడి దగ్గరకు!
అప్పటికి తమిళం తప్ప తెలుగు రాని నటరాజన్‌కి చాలా కష్టమైపోయింది. ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలి అనుకున్నాడు. వచ్చేపోయే కస్టమర్లతో లల్లాయి మాటలు మాట్లాడేస్తే ఆమాత్రం తెలుగు నేర్చుకోవడం ఏమాత్రం కష్టం కాదు. కాని నటరాజన్ తురగా వెంకటేశ్వర్రావు అనే తెలుగు టీచర్ దగ్గరకెళ్లేవాడు. అమిత ఆసక్తితో తెలుగుని ఒంటపట్టించుకున్నాడు. ఇడ్లీ పొట్లాలు కట్టే కాగితమ్ముక్కను కూడా వదిలిపెట్టేవాడు కాడు. హోటల్లో పెట్టిన తెలుగు సినిమా పాటల్ని వింటూ, పదాల్ని పెదాలపై కూర్చేవాడు. రామలింగేశ్వరుడి గుడికి ఎదురుగా ఉన్న మునిసిపల్ లైబ్రరీలో, మారీస్‌పేటలోని ఆంధ్రరత్న లైబ్రరీలో దొరికిన పత్రికనల్లా నమిలి మింగేసేవాడు.
తెనాలొచ్చిన ఏడాదికి నాన్న మరణం, 13 ఏళ్ల వయసులో అగ్నిహోత్రం వెనకే నాన్న శవం, చితిపై నాన్న గుండెలపై అగ్నికుండ పెట్టిన వైనం, భళ్లుమని పేలిన భాండోదకం, తానే బలి అన్నమైపోయినంత దుఃఖం... ఆ చిన్ని గుండెని చితిమంట కాల్చేసింది. ఆ రాత్రే తొలిసారి నటరాజన్‌కి మూర్ఛ వచ్చింది. గిలగిల కొట్టుకుంటూ మురిక్కాలవలో పడిపోయాడు. తెల్లారి లబోదిబోమంటూ ఏడుస్తూ అక్క వచ్చేంతవరకూ... పెంట కుప్పలోనే ఉండిపోయాడు!
బావగారి హోటల్లో పనిచేస్తున్నా, నటరాజన్ చూపంతా సాహిత్యంపైనే ఉండేది. పనీపాటా నేర్చుకోకుండా కథలూ కాకరకాయలంటూ పిల్లాడు చెడిపోవడం ఆయనకు నచ్చలేదు. మాట వినకపోతే తిట్టేవాడు. కొట్టేవాడు. నల్లటి నలుపు, లావు, పొట్ట, పొట్టి, చింతనిప్పుల్లాంటి కళ్లు, లావాటి పెదాలు - ఇలాంటి భీమారావు- సన్నగా, ఎర్రగా, అట్లకాడలా, రివటలా పల్చటి ముఖంతో ఉన్న నటరాజన్‌ని కొడితే... ఒళ్లు హూనమైపోయేది. అయినా పుస్తకాలు చదవడం మానేవాడు కాడు. మండవ శ్రీనివాసరావుది అజంతా కూల్‌డ్రింక్స్. ఆ పక్కన ఉండే స్టాండ్ల దగ్గరి పత్రికల్ని ప్రేమించేవాడు. బోస్ రోడ్డులో కోతుల చెట్టు ఎదురుగా నారాయణరావు నడిపే పీపుల్స్ బుక్‌స్టాల్ దగ్గరే తిష్ట వేసేవాడు. హోటల్లో రోజూ పన్నెండు గంటల అరవ చాకిరీ, ఆపై ఒళ్లు తెలీని రీతిలో తెలుగు సాహితీ కచేరీ. పైగా హోటల్లో కాస్త చదువుకున్నవారిలా అనిపించేవారు కనిపిస్తే చాలు, ‘ఏవైనా పుస్తకాలుంటే ఇస్తారా’ అని సిగ్గు విడిచి అడిగేవాడు. టిప్పు అడిగితే అణాపైసలొస్తే ఆకలి తీరుతుందని తెలుసు. అయినా పుస్తకాల పిచ్చి. అదో సాహిత్యపు వెర్రి.
ఇతర హోటళ్లల్లో పనిచేసే తనలాంటి వారిని జతచేసి ఓ జట్టు కట్టాడు. పావులూరి రామారావు హోటల్లో పనిచేసే ఆలూరి భుజంగరావుతో ప్రాణమైత్రి ఏర్పడింది. తెలుగుపై పట్టు వచ్చేందుకు నటరాజన్‌కి ఓ ఆలోచన వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకూ తాము చూసిన దృశ్యాల్ని, మనుషుల్ని, సంఘటనల్ని, పరిస్థితుల్ని, మనస్తత్వాల్ని, మంచి చెడుల్ని... రాత్రి రాసేసి ఉదయాన్నే మిత్రుడికి ఇచ్చుకోవాలి - భుజంగరావూ అదే చేయాలి.
తెలుగు నేలలో అభ్యుదయ సాహిత్యం వీస్తున్న రోజులవి. ఆకలి, దరిద్రం, భయం, బాధ, ఎప్పుడు వస్తుందో తెలీని మూర్ఛ... ఇలాంటి నటరాజన్ అభ్యుదయ భావాల్ని అర్థం చేసుకోవడం మొదలె ట్టాడు. 1943లో తాపీ ధర్మారావు అధ్యక్ష తన అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగినది తెనాలిలోనే. 1946లో పెదపూడిలో నెల రోజుల పాటు జరిగిన అరసం సాహిత్య పాఠశాలకు నటరాజన్ హాజరయ్యాడు. ఆ ప్రభావంతోనే ‘ప్రపంచానికి జబ్బు చేసింది’ అని ఓ వ్యంగ్య రచన చేశాడు. అది 1946 జూలై 14న ప్రజాశక్తిలో అచ్చయింది - ఎస్.నటరాజన్ పేరుతో! ఇక సాహిత్యమే ప్రపంచమైంది. సర్వర్ ఉద్యోగం ఊడిపోయింది. జానెడు పొట్ట కోసం ఎన్ని పాట్లు పడ్డాడో. మారీస్‌పేట నుంచి రైల్వేస్టేషన్‌కి వెళ్లే మొగలో ఫ్యాక్టరీ గోడవారన, ఓ చిన్న పాక హోటల్ పెట్టాడు. ఓ పళ్ల కొట్లో పనిచేశాడు. బుర్రిపాలెంలో టీ బంకు పెట్టాడు. మునిసిపాలిటీ వాళ్లొచ్చి నిర్దాక్షిణ్యంగా ఆ సామాన్లు ఎత్తుకుపోతే - ఆమ్యామ్యా ఇవ్వలేదు. ఆనందంగా బంగారం దుకాణాలుండే షరాబ్ బజార్‌కెళ్లిపోయి పూరిపాకలో ఇంకో టీకొట్టు పెట్టాడు. అంతలో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆగస్టు 15 అర్ధరాత్రి దాటాక, తెనాలి రోడ్లమీద పిచ్చిపిచ్చిగా తిరిగాడు. నెలరోజుల నుంచీ పని చేయించుకుని జీతం అడిగిన పనివాళ్లని తన్ని బయటకు నెట్టేసిన యజమానులు, తిని పారేసిన విస్తరాకుల దగ్గర కుక్కల్లా సర్వర్లను చూసే హోటల్ కామందులు, సిద్ధాంతాలు వల్లెవేసే తెల్ల టోపీ రాయుళ్లు... జెండా ఎగరేస్తూంటే ‘ఛీ’ అనుకున్నాడు నటరాజన్. కూటికోసం గొడ్డులా చాకిరీ చేసే కష్టజీవులు, యజమాని తిట్టి కొట్టి మెడపట్టి గెంటేసినా ఏమీ చేయలేని అభాగ్యులు, అన్నం కోసం శరీరాన్ని నగ్నంగా అమ్ముకునే వేశ్యలు, బ్రాకెట్, తాగుడు, పేకాట, చిల్లర దొంగతనాలకు బానిసలైనవాళ్లు, తారుపుగాళ్లు, మందుభాగ్యులు... వీళ్ల దగ్గర చిల్లర కోసం చేయి చాచే పోలీసోళ్లు... లోకాన్ని పచ్చిగా చూశాడు నటరాజన్.
గుండెల్లో సుళ్లు తిరిగిన ఈ భావాలన్నీ అక్షరాలయ్యాయి. ఎప్పుడూ చేతిలో ఓ అట్ట, క్లిప్పుకి పాత తెల్ల కాగితాలు. రాయడానికి ఏసీ రూముల్లేవు. మస్తాన్ సాయెబ్ గడియారాల రిపేర్ షాపు, అంబా కేఫు, సోమలింగాచారి బంగారప్పని కొట్టు, క్రాంతి థియేటర్ ఆఫీసు, నలందా ప్రెస్ ఎదుటి వీధిలోని ఓ రాతిబల్ల... ఎక్కడ పడితే అక్కడ, ఏమొస్తే అది రాసేసేవాడు.
అప్పుడే గొప్పవాడి భార్య అనే వ్యంగ్య రచన చేశాడు. అది ‘జ్యోతి’ పత్రికలో 1948 జనవరి 30న వచ్చింది. శారద అన్న కలం పేరిట అచ్చయిన మొదటి ప్రచురణ అది. గాంధీ భార్య కస్తూరిబా ఛాయలున్న రచన అది. అదే రోజున గాంధీ హత్య జరగడం ఓ యాదృచ్ఛికం. నరబలి, అహల్య లాంటి నాటికలు, తెలుగు స్వతంత్ర పత్రికలో ‘క్షణంలో సగం’ అంటూ సెటైర్లు... ఎన్ని రాశాడో శారద! అన్నింటా పాడులోకంపై కసే! ఎన్ని హోటళ్లు మారినా పని దొరకని దినాలు. అంతటి ఆకటి సామ్రాజ్యంలో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడే మొగుణ్ని పోగొట్టుకున్న ‘కన్యాశుల్కం’లోని బుచ్చమ్మ అంటే ఇష్టం శారదకి. ఓసారి అన్నపూర్ణ అనే ఓ వితంతువు తారసపడింది. ఇష్టపడ్డాడు. చిదంబరం నటరాజస్వామి ఆలయంలో ఉత్త దండల మార్పిడితో పెళ్లి అయిపోయింది. ఆమె మలయాళీ! ఇంతవరకూ తానొక్కడే. మరిప్పుడో సంసార భారం. కొన్నాళ్లు జ్యోతి పత్రికలో పనిచేశాడు. చల్లని నిమ్మకాయ మజ్జిగను కుండలో పెట్టి అమ్మేవాడు. మారీస్‌పేట నుండి రేపల్లె గేటు వైపు వెళ్లే రోడ్డులో కోమట్ల బట్టల దుకాణం మెట్ల వారన సాయంత్రాలు వేడివేడి గారెలు, మిరపకాయ బజ్జీలు అమ్మేవాడు.
అదే చేత్తో మంచీ చెడూ, అపస్వరాలు, ఏది సత్యం, చీకటి తెరలు లాంటి నవలలు, వందకి పైగా కథలు రాశాడు.
1952-53లో శారద మొదటి నవల ‘మంచీ చెడూ’ ఆంధ్రపత్రిక వీక్లీలో వచ్చింది. కారణం ఇన్‌చార్జి ఎడిటర్ సూరంపూడి సీతారాం. రష్యన్ రచయిత డాస్టాయ్ వెస్కీతో పోల్చదగ్గ శైలి శారదది అని అంతా పొగిడారు. శారదలాగ డాస్టాయ్ వెస్కీ కూడా మూర్ఛబారిన పడ్డవాడే కావడం యాదృచ్చికం! 1955 ఆగస్టు 17. అప్పటికి పిల్లలు పుట్టారు శారదకు. అన్నపూర్ణ మళ్లీ గర్భిణి. రాత్రి 8 గంటల బండికి స్నేహితుడు పనిమీద నెల్లూరు వెళ్తుంటే స్టేషన్ దాకా వీడ్కోలు చెప్పాడు శారద. మిత్రుడిచ్చిన పదణాల్ని జేబులో వేసుకున్నాడు. ఇంటికొచ్చాడు. స్నానం చేశాడు. ఒక్క క్షణం ఒంటినెవరో కుదిపేసినట్లయింది. గోడ మేకుకి తగిలించిన చొక్కా జేబులోంచి బీడీ కట్ట, అగ్గిపెట్టె తీద్దామని చేయి పెకైత్తాడు. అంతే! పెద్దగా అరిచాడు. వెంటనే పీలగా మూలిగాడు.
శారద నేలకొరిగాడు. సాహిత్యపు శ్వాస ఆగిపోయింది.
ఏమీ సంపాదించుకోలేదు శారద. అప్పటికి పదేళ్లుగా తెలుగు కోసం పడిచచ్చిపోతూన్న ఈ తమిళ తంబిని చూశారు తెనాలివాళ్లు. తండోప తండాలుగా వచ్చారు. ఇప్పుడు ఇలా పడి ఉన్న వైనం చూసి గొల్లుమన్నారు. జోలె పట్టారు. దానాలు అడిగారు. చందాలేసుకున్నారు. శారద శవాన్ని సాగనంపారు. ఏం సంపాదించుకోలేదు శారద? పరభాషను మాతృభాష చేసుకుని, తెలుగువారు తమ భాషను మృతభాష చేసుకోకూడదన్న ఆశయ సంపద శారదది! బతుకంటే మేడలు మిద్దెలు కాదన్న శాశ్వత జీవిత సత్యాన్ని చెప్పి చచ్చిపోవడమేనన్న బంగారప్పలుకు శారదది. ఎప్పుడు మూర్ఛ వచ్చి పడిపోతాడో తెలీకున్నా ఏదో రాయాలన్న, భావితరాలకు బతుకు విలువ చెప్పాలన్న వజ్రపు తపన శారదది. -ఆకెళ్ల రాఘవేంద్ర ఫొటో కర్టెసీ: ముమ్మనేని నాగేశ్వరరావు |
No comments:
Post a Comment